
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లో ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ పై దాడి జరిగిందని రుజువైంది. కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ కొద్ది రోజుల క్రితం స్వాతి మలివాల్ ను తిట్టి, కాలుతో తన్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన పై గతకొన్ని రోజులుగా రాజకీయ దుమారం లేపుతుంది. లోక్ సభ ఎన్నికల వేళ సొంత పార్టీ నాయకురాలిపైనే చేయిచేసుకోవడం చర్చనీయాంశమైంది. ప్రతిపక్ష నేతలు మహిళా ఎంపీ స్వాతి మలివాల్ పై దాడిని ఖండిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తులో భాగంగా శుక్రవారం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో దాదాపు మూడు గంటల పాటు వైద్యులు పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో ఆమె ముఖంపై ఇంటర్నల్ ఇంజూరీస్ అయినట్లు తేలింది.
దాడి జరిగిన రోజే స్వాతి మలివాల్ పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. కానీ పోలీసులు అక్కడికి వెళ్లి చూడగా అక్కడ అంతా నార్మల్ గా ఉంది. తర్వాత ఆమె కూడా అక్కడ లేదు. ఆమెపై దాడి జరిగిందా లేదా అని రెండు రోజులుగా చర్చ జరిగింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బిభవ్‌ను నిందితుడిగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. బిభవ్ కుమార్ తనపై భౌతిక దాడి చేసి కాలితో ఛాతిపూ తన్ని, కర్రతో కొట్టినట్లు పోలీస్ స్టేట్ మెంట్ ఇచ్చింది. అంతేకాకుండా కడుపులో గట్టిగా కొట్టినట్లు పోలీసులకు చెప్పింది. ఈ ఘటనను జాతీయ మహిళా కమిషన్ సైతం సుమోటోగా తీసుకుంది. బిభవ్ కుమార్‌కు గురువారం సమన్లు జారీ చేసింది. శుక్రవారం విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశించింది.